లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. బయట ప్రచారం కంటే సోషల్ మీడియాలో ప్రచారం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే పాత ఫోటోలు, వీడియోలు.. ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు చేసే పోస్ట్‌లు తీవ్ర వివాదానికి దారి తీస్తూ ఉంటాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు, ఆ అభ్యర్థి అభిమానులు.. తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పద్మ వ్యూహంలోనే టీమిండియా మహిళా క్రికెటర్ చిక్కుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా సహా మోదీ కేబినేట్‌లోని కీలక నేతలను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను దుమారానికి కారణం అయింది.
ప్రధాని మోదీ, కేంద్ర కేబినెట్‌ను ఉద్దేశించి కించపరిచేలా విధంగా వసూలీ టైటాన్స్ అంటూ పూజా వస్త్రాకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. అందులో కేంద్ర పెద్దల ఫోటోలు ఉండటంతో వారిని హేళన చేస్తూ పోస్టు పెట్టడంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోను నెటిజన్లు తెగ వైరల్ చేయడంతో పెద్ద వివాదం తలెత్తింది. దీంతో కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆ ఫోటోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జై శంకర్, అనురాగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరీ, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోటో ఉంది. అంతేకాకుండా ఇందులో ఇంపాక్ట్ ప్లేయర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అని ఆ పోస్ట్‌పై రాసి ఉంది.
ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో పూజా వస్త్రాకర్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, కేంద్ర కేబినెట్‌ను ఉద్దేశిస్తూ పెట్టి పోస్టు వివాదాస్పదం కావడంతో ఆ పోస్ట్‌ను పూజా వస్త్రాకర్ డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే పూజా వస్త్రాకర్ చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు నెటిజన్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోస్ట్ పెట్టిందని ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వంపై ఒక క్రికెటర్ ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. వెంటనే ఆమెను భారత జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
పూజా వస్త్రాకర్ ఆ పోస్ట్ తొలగించినప్పటికీ.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల దోపిడీ నుంచి బయటపడేందుకు బీజేపీ.. తనను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రకటన చేసిన తర్వాత ఆమె ఈ పోస్టు పెట్టింది. ఇక ఈ వివాదం సోషల్ మీడియాలో తెగ దుమారం రేపడంతో పూజా వస్త్రాకర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తన అకౌంట్ నుంచి వివాదాస్పద పోస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అయితే తన ఫోన్ తన వద్ద లేని సమయంలో ఇది జరిగిందని పేర్కొంది. జరిగిన ఘటనకు తాను చాలా చింతిస్తున్నట్లు పేర్కొన్న పూజా వస్త్రాకర్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎంతో గౌరవమని వెల్లడించింది. ఈ క్రమంలోనే జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది.