విమానంలో తనకు జరిగిన ఓ అనూహ్యమైన సంఘటనను తాజాగా ఓ మహిళ.. మీడియా ముందు వెల్లడించింది. జనవరిలో జరిగిన భయానక అనుభవాన్ని తాజాగా పంచుకుంది. బ్రా వేసుకోలేదని.. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనను బెదిరించినట్లు ఆ మహిళ వెల్లడించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. బ్రా ధరించలేదని తన పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది అమర్యాదగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్లైట్ కూడా ఎక్కవద్దని అడ్డుకున్నారని పేర్కొంది. విమాన సిబ్బంది చేష్టలతో తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ లాస్ ఏంజెల్స్‌లో మీడియాకు జరిగిన ఆ సంఘటనను వివరించింది.
ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. లిసా ఆర్చ్ బోల్డ్ అనే 38 ఏళ్ల మహిళ డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను బ్రా ధరించని కారణంగా తనను విమానం నుంచి దింపేస్తామన్నారని హెచ్చరించారని పేర్కొంది. ఇది ముమ్మాటికీ వివక్షేనని మండిపడింది. తాను బ్యాగీ జీన్స్, లూజ్ టీ షర్ట్ వేసుకుని లోపల బ్రా వేసుకుండా విమానం ఎక్కినట్లు లిసా ఆర్చ్ బోల్డ్ తెలిపింది. అది గమనించిన డెల్టా ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది తనను అడ్డుకున్నట్లు తెలిపింది. అయితే తన ఎద భాగం బయటికి కనిపించకపోయిప్పటికీ వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. డీజే అయిన ఆర్చ్‌బోల్డ్.. అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన జరిగింది.
ఈ అనూహ్య సంఘటన జనవరిలో జరిగిందని.. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపింది. విమాన సిబ్బంది తనతో అలా చెప్పడం వల్ల తీవ్ర అవమానంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను మహిళను కానని భావించి వారు తన పట్ల అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అనిపించిందని పేర్కొంది. తాను బ్రా ధరించకపోవడం వల్ల తన ఎద భాగం బహిర్గతం అయిందని.. అది ఆక్షేపణీయంగా ఉందని.. అందుకే తనను విమానంలోకి అనుమతించబోమని డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనకు చెప్పినట్లు గుర్తు చేసుకుంది. టీ షర్ట్‌పై జాకెట్ వేసుకుంటేనే విమానంలో ప్రయాణించడానికి అనుమతిస్తామని చెప్పినట్లు పేర్కొంది. ఈ ఘటనపై చర్చించేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్ కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం కావాలని నిర్ణయించుకుని.. బాధిత మహిళ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ఓ లాయర్ లేఖ రాశారు.
టీ షర్టులపై పురుషులు ఎలా జాకెట్లు వేసుకుంటారో అలా మహిళలు వేసుకోవాల్సిన అవసరం లేదని ఆ లాయర్ వాదించారు. ఒకవేళ భద్రతాపరమైన ముప్పు ఉంటేనే ప్రయాణికులను విమానం దింపాలి కానీ.. ఇలాంటి వాటికి దింపేస్తారా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశం తర్వాత డెల్టా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆర్చ్ బోల్డ్‌కు సదరు ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.