భారత త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకం తీసుకువచ్చిన కొత్తల్లో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అయినా వెనక్కి తగ్గని కేంద్రం.. ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ విభాగాల్లో ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులను రిక్రూట్ చేసుకుంటోంది. అయితే మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగనున్న వేళ.. అగ్నిపథ్స్కీమ్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్కీలక ప్రకటన చేశారు. దేశ రక్షణ దళాల్లో యువతరం రావాల్సిన ప్రాధాన్యాన్ని వెల్లడించిన రాజ్‌నాథ్ సింగ్ అగ్నివీర్ పథకాన్ని మరోసారి సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అవసరమైతే ఈ పథకాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం అమలు చేస్తున్న అగ్నిపథ్లేదా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్స్కీమ్‌లో అవసరమైతే మార్పులు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్ కింద సాయుధ దళాలకు ఎంపికైన అగ్నివీరుల భవిష్యత్ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. సైన్యంలో యువత ఉండాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ అగ్నివీర్ స్కీమ్ పట్ల ప్రస్తుత యువత ఉత్సాహంగా ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
అగ్నివీరులు అంతా అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్నారని తాను నమ్ముతున్నట్లు రాజ్‌నాథ్ వివరించారు. ఈ అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీరుల భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేందుకు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతే కాకుండా అగ్నివీర్ పథకంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది మరింత పటిష్ఠంగా తయారు చేస్తామని పేర్కొన్నారు.
అయితే రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. కేంద్రం ఈ ప్రకటన చేయడం ఎన్నికల గిమ్మిక్కే అని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో గెలిచి ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తప్పకుండా అగ్నిపథ్ పథకాన్ని సమూలంగా మారుస్తామని తేల్చి చెప్పింది.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2022 జూన్‌లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఆ అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన యువతీయువకులను అగ్నివీరులు అంటారు. వీరు కేవలం 4 సంవత్సరాల పాటు సర్వీసులో ఉంటారు. ఇందులోనే 6 నెలల శిక్షణా కాలంతో పాటు మూడున్నరేళ్లు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత సర్వీసు నుంచి పదవీ విరమణ పొంది.. అనంతరం సాయుధ దళాల్లోనే కొనసాగేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం అగ్నివీరులకు కల్పించారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. అగ్నిపథ్ కింద ఎంపిక అయిన వారు కేవలం 4 ఏళ్లే సర్వీసులో ఉండాలంటూ కేంద్రం తీసుకువచ్చిన కొత్త విధానంపై త్రివిధ దళాల్లో చేరాలని సిద్ధం అవుతున్న యువత తీవ్ర ఆందోళనలు చేసింది.