ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చివరిది కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరికొంత మందిని విచారించాలని ఈడీ నిర్ణయించడమే ఇందుకు కారణం.
తాజాగా.. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మద్యం కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌కు కైలాష్ మద్దతిస్తున్నారనే ఆరోపణలపై సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. శనివారం అత్యవసరంగా తమ వద్దకు రావాలని ఈడీ సమన్లలో కోరింది. పైగా.. రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ మద్యం పాలసీ ముసాయిదాలో సభ్యుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత, అతని ఫోన్ నంబర్లు తరచుగా మారుతున్నాయని ED వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు (శనివారం) తమ ఎదుట హాజరుకావాలని మంత్రి కైలాష్‌కు ఇచ్చిన సమన్లలో ఈడీ స్పష్టం చేసింది.