సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణంక్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగసభ నిర్వహించారు. పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు. కాగా.. కొన్నిరోజులుగా చంద్రబాబు ప్రసంగం పూర్తి మార్చేసి.. ఓ రేంజ్‌లో జగన్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఇలాకాలో చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.