జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్ దిగగానే ఆలయానికి బదులు మాజీ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వక భేటీ కానున్నారు. అనంతరం హోటల్‌కు వెళ్లి బస చేయనున్నారు. ఇంతకు ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమైతే.. ఈరోజు మధ్యాహ్నం 1గంటకు పిఠాపురం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉంది. అనంతరం అక్కడే వారాహి వాహనానికి పూజలు నిర్వహించాలని భావించారు. అనంతరం 1.30కు దత్త పీఠాన్ని దర్శించుకోవాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దొంతమూరులో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ తో భేటీ.. అక్కడి నుంచి పిఠాపురంలో తన బసకు పయనం కావాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్‌లో వారాహి విజయభేరీ బహిరంగసభ నిర్వహించాల్సి ఉంది కానీ ఆలయం మూసివేత కారణంగా పవన్ తన పర్యటన మొత్తాన్ని మార్పులు చేసుకున్నారు. కాగా.. పవన్ తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 12 వరకూ ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్ 2 వరకూ ఆయన పిఠాపురంలో ఉంటారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.