ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవాలయంలో ఈనెల 9 నుంచి క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ప్రారంభంకానున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు వెల్లడించారు. బుధవారం చైత్ర మాస బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 9వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగాది రోజున మధ్యాహ్నం 3 గంటలకు పంచగ శ్రవణం జరుగుతుందన్నారు. తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి పంచగా శ్రవణాన్ని పఠిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటలకు వెండి రథం నగర ఉత్సవానికి వెళ్తుందన్నారు. ఉగాది రోజు ఆర్జిత సేవలు కొన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉగాది రోజున ఉదయం 8 గంటల నుంచి దుర్గమ్మ దర్శనాలు ప్రారంభం అవుతాయన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పుష్పార్చన సేవలు ఉంటాయన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు పుష్పాలు సమర్పించాలనుకునే వారు ఒక రోజు ముందుగా తెలియజేయాలని ఈవో విజ్ఞప్తి చేశారు. 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు వాహన సేవలు ఉంటాయన్నార. ఈ నెల 22 న రాత్రి 10.30 నిముషాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కల్యాణమహోత్సవం జరుగుతుందన్నారు. 24న ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి.. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర క్రుష్ణానదిలో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గగుడి ఈవో రామారావు పేర్కొన్నారు.