ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బస్సుయాత్ర, బహిరంగ సభలతోపాటు వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుస్తున్నారు. వారి బాధలు అడిగి తెలుసుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలి.. ఏమేం పథకాలు ప్రవేశపెట్టాలి అనే అంశాలపై నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా బుధవారం 8 వ రోజు.. చిన్న సింగమలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక హామీని ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే.. సొంత టిప్పర్లు ఉన్న డ్రైవర్లకు కూడా ఏటా రూ.10 వేలు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలోని గురవరాజుపల్లె నుంచి బుధవారం బయలుదేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమల సమీపానికి చేరుకుంది. చిన్న సింగమలలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కీలక హామీని జగన్ ఇచ్చారు. ప్రజలందరి దీవెనతో ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత టిప్పర్లు ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. క్రమం తప్పకుండా టిప్పర్ డ్రైవర్లకు ఈ సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
3,93,655 మంది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు గత 58 నెలల కాలంలో ఏకంగా రూ.1296 కోట్లు అందించామని చెప్పారు. వాహన మిత్ర అనే పథకాన్ని తీసుకొచ్చి సొంతంగా ట్యాక్సీ గానీ, ఆటో గానీ కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న వారికి లబ్ధి చేకూర్చినట్లు జగన్ లెక్కలతో సహా వివరించారు. అయితే దీన్ని టిప్పర్ డ్రైవర్లకు కూడా వర్తింపజేయడంపై స్పందించిన జగన్.. ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్నారని.. చెప్పారు. ఇక మిగిలిన వారికి నవరత్నాల్లోని అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేస్తున్నారని.. టిప్పర్ డ్రైవర్‌ను అసెంబ్లీలో కూర్చోబెట్టేందుకే ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లు చెప్పారు. ఒక టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వీరాంజనేయులు.. ఎంఏ ఎకనామిక్స్ చదివాడని.. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా ఉపాధి కోసం టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.