తిరుపతి జిల్లాలో టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం ఘటన కలకలంరేపింది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి.. పట్టణంలోని 5వ వార్డులో ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి సెల్ఫీ ఫోటో పేరుతో దగ్గరకు వచ్చాడు. సుధీర్ రెడ్డికి కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. అయితే అతడి తీరుపై అనుమానం రాగా.. అతడి జేబులో ఓ కత్తిని గుర్తించారు. వెంటనే అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు టీడీపీ కార్యకర్తలు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి కత్తితో వచ్చిన వ్యక్తి వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అతడిని చంద్రగిరికి చెందిన మహేష్ కుమార్‌గా గుర్తించారు. అయితే ఈ ఘటనపై సుధీర్ రెడ్డి స్పందించారు.. ఉద్దేశకపూర్వంగానే తనపై దాడి చేసేందుకు కత్తితో వ్యక్తిని పంపించారని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
కత్తితో వచ్చిన వ్యక్తి పేరు మహేష్ కుమార్ అని.. అతడి భార్య మీనా కుమారి వివరాలు తెలిపారు. మహేష్ కుమార్‌ది చంద్రగిరి కాగా.. తనది శ్రీకాళహస్తి అన్నారు. అతడు మద్యానికి బానిస కాగా.. కొంతకాలంగా భర్తతో విభేదాలు ఉన్నట్లు చెప్పారు.. కొద్దిరోజుల క్రితం మహేష్ తన పుట్టింటికి వచ్చారన్నారు. మద్యానికి బానిసైన తన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించనట్లు మీనా చెబుతున్నారు. అయితే ఇంతలో శ్రీకాళహస్తిలో జరిగిన జాతరలో కొందరితో మహేష్ గొడవపడినట్లు భార్య చెబుతున్నారు.
జాతరలో తనతో గొడవపడిన వారిపై కోపంతో.. మహేష్ ఆవేశంగా ఇంట్లో నుంచి కత్తి తీసుకుని నుంచి వచ్చాడని.. ఆ తర్వాత సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నట్లు మీనా కుమారి చెబుతున్నారు. మహేష్‌కు పార్టీలకు సంబంధం లేదని.. మద్యం తాగిన మత్తులో ఇలా జరిగిందని ఆమె అంటున్నారు. తన భర్తకు హత్య చేసేంత ధైర్యం లేదని.. మద్యం మత్తులో తప్పు జరిగిందన్నారు. జాతరలో గొడవపడిన వారి దగ్గరకు వెళ్లేందుకు మహేష్ వెళుతూ.. మధ్యలో సుధీర్ రెడ్డి ప్రచారం దగ్గరకు వెళ్లడంతోనే ఇదంతా జరిగింది అంటున్నారు. అయితే తన భర్త చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడని ఆమె చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.
మహేష్ కుమార్ సుధీర్ రెడ్డిపై దాడి చేద్దామని కత్తిని తీసుకెళ్లలేదని.. అతడి బావమరిది చెబుతున్నారు. మద్యం మత్తులోనే ఇదంతా జరిగిందని.. సెల్ఫీ తీసుకునేందుకే వెళ్లారన్నారు. అతడి జేబులో కత్తిని చూసి టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం కోసం వచ్చినట్లు చెబుతున్నారని.. అతడి జేబులో కత్తిని చూసి అందరూ కంగారుపడ్డారని చెప్పుకొచ్చారు. పార్టీలకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.