ఏపీలో మత్స్యకారులకు బ్యాడ్‌న్యూస్. సముద్ర జలాల్లో వేటను నిషేధించారు.. ఈనెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపలవేటపై నిషేధం విధించామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చేపల వేట సాగిస్తే ఏపీ ఎంఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. మత్స్యసంపద సహా బోటును స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తామన్నారు. ఆయిల్ రాయితీని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఏడాదిలా ఈ ఏడాది సముద్ర జలాలలో 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమలు కానుంది.
తాజా ఉత్తర్వులు ప్రకారం.. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు సముద్ర జలాలలో యాంత్రిక పడవలు (మెకనైజ్‌డ్, మోటారు బోట్లు) ద్వారా అన్ని రకాల చేపల వేట సాగించరాదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ జీవో ఆర్‌టీ నెంబర్ 81లో పొందుపరిచింది. వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్ధిరతను సాధించడం ముఖ్య ఉద్దేశ్యంగా సముద్ర జలాలలో చేపట వేట నిషేధం అమలు చేస్తున్నారు.
ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాలలో యాంత్రిక పడవలు (మెకనైజ్‌డ్, మోటారు బోట్లు )పై మత్స్యకారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాల్సి ఉంది. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసిన బోట్ల యజమానులను ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 ,సెక్షన్ (4) ప్రకారం శిక్షార్హులు అవుతారు. వారి బోట్లను, బోట్లలో ఉన్న మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధించనున్నారు.
అంతేకాదు ప్రభుత్వం అందించే డీజిల్ ఆయిల్ సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీ సౌకర్యాలను నిలుపుదల చేయనున్నారు. ఈ నిషేధ కాలాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేసింది. అందువల్ల మత్స్యకారులందరూ సముద్ర జలాలలో చేపల వేట నిషేధ కాలంలో సహకరించాలని రాష్ట్ర మత్స్య శాఖ అధికారులు కోరారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతిని పెంచడం ద్వారా సముద్ర మత్స్య సంపదపై సుస్థిరత సాధించడమే నిషేధంలోని ప్రధాన ఉద్దేశం. అంతేకాదు ఏపీ ప్రభుత్వం చేపలవేట విరామ సమయంలో అర్హులైన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలల నిషేధకాలాన్ని తప్పక పాటించాలని, లేకపోతే వేటకు వెళ్లిన మత్స్యకారులపై చట్టపరమైన చర్యలతోపాటు జరిమానా వేసి, బోటు లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు.