వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉందని, వాళ్ల వారసత్వమే శవ రాజకీయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. 2024లో జగన్ మళ్లీ శవ రాజకీయం మొదలు పెట్టాడని, వైసీపీ శవాల కోసం వెతుకుతోందని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నల్లజర్లలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘జగన్‌రెడ్డిది శవరాజకీయం. ఎవరైనా మంచి పనిచేసి నాకు ఓటేయమని అడుగుతారు. కొంతమంది మనుషులను చంపేసి ఎదుటివాళ్ల పైకినెట్టి ఓటు వేయమని అడుగుతారు. జగన్ తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. కానీ తన తండ్రిని చంపేశారని జగన్ అన్నాడు. రిలయన్స్ అధినేత చంపేశాడని కూడా అన్నాడు. వాళ్ల షాపులపైన దాడులు కూడా చేశాడు. మళ్లీ అదే రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ సీటు ఇచ్చాడు. 2014లో తండ్రి లేని బిడ్డ అంటూ ఓటు వేయమని అడిగాడు. ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు తప్ప ఎవ్వరూ వద్దని నన్ను గెలిపించారు. 2019లో మళ్లీ శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తరువాత బాబాయిపై గొడ్డలి వేటుపడింది. ‘మా నాన్న చనిపోయాడు. ఉన్న ఒక్క బాబాయిని కూడా చంపేశారు. నారాసుర రక్తచరిత్ర’ అనికూడా జగన్ చెప్పాడు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుటికైనా నిజం చెప్పు.. హూ కిల్డ్ బాబాయి?’ అని చంద్రబాబు మండిపడ్డారు.