జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బాలకృష్ణలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది . వైయస్ఆర్‌సీపీ శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తిలు ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈనెల 14 వతేదీన తెనాలి నియోజకవర్గంలో జరిగిన జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఉద్దేశించి ఎన్నికల నియమావళికి విరుధ్దంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 13వతేదీన తెలుగుదేశం పార్టీనేత నందమూరి బాలకృష్ణ కదిరి బహిరంగసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి బాలకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈనాడు దినపత్రికపై కూడా కేంద్ర, రాష్ట్రఎన్నికల సంఘాలకు వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. సలహాదారులు వైయస్ జగన్ మాయదారి మేతగాళ్లు అనే శీర్షికన వార్త ప్రచురించారు. అందులో పేర్కొన్న అంశాలు ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ఉన్నాయి. తగిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ కోరింది.