శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. అయోధ్యకు వచ్చినవారే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న హిందువులు కూడా ఇంటర్నెట్‌లో అయోధ్య రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడటం చూసి పులకించి పోయారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ మహాఘట్టాన్ని వీక్షించారు. విమానంలో ప్రయాణిస్తూనే ఆన్‌లైన్‌లో సూర్యతిలకాన్ని వీక్షించి భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో షూ విప్పేసి చూస్తున్న ఫోటోలను ప్రధాని ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాలతో బిజీగా ఉన్న ప్రధాని.. అయోధ్యలో ఏర్పడిన ఈ మహా అద్భుత దృశ్యాన్ని చూశారు.
ఇక అయోధ్యలో సూర్య తిలకం దృశ్యం ఆవిష్కృతం అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్ చేశారు. ఇంటర్నెట్‌లో తాను కూడా ఆ సూర్య తిలకాన్ని చూసిన ఫోటోలను షేర్ చేశారు. అస్సాలోని నల్‌బడీ ర్యాలీ తర్వాత రామ్‌లల్లా నుదిటిపై సూర్యతిలకాన్ని చూసి తరించానని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల్లాగానే తనకు కూడా ఇది ఎంతో ఎమోషనల్ మూమెంట్ అని తెలిపారు. అయోధ్య చరిత్రలోనే అత్యంత ఘనమైన శ్రీరామనవమి ఉత్సవం ఇదేనని వెల్లడించారు. ఈ సూర్యతిలకం వికసిత భారతం తీసుకునే ప్రతీ సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో తెలిపారు. ఈ సూర్య తిలకం మన జీవితాలకు కొత్త శక్తిని తీసుకురావాలని.. కీర్తిపతాకలో మన దేశం కొత్త శిఖరాలను చేరుకునేలా కొత్త స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
నల్‌బడీ ర్యాలీ తర్వాత విమానంలో ప్రయాణిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలో పర్యటించిన పర్యటించిన ప్రధాని మోదీ.. నల్‌బడీ సభలో అయోధ్య రాముడి ప్రస్తావన తీసుకొచ్చారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు సొంతింటికి చేరుకున్నాడని.. దివ్య భవ్య మందిరంలో తన పుట్టినరోజును చేసుకున్నాడని తెలిపారు. ఆ అయోధ్య రాముడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఇక అయోధ్యలో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఏర్పడిన సూర్య తిలకం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక లక్షల మంది ఆ సూర్యతిలకాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అయోధ్యకు చేరుకున్నారు.