జగన్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైందని, వ్యతిరేకంగా మాట్లాడితే జైలులో వేయటమే ఆయనకు తెలుసని ఎన్డీఏ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. బుధవారం పెడన బస్టాండ్ సెంటర్‌లో జరిగిన ప్రజాగళం యాత్రలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నా ప్రజలకు సేవ చేయలేకపోయానన్నారు. తీరప్రాంత మంచినీటి సమస్యకు జలజీవన్ మిషన్ నుంచి రూ.330 కోట్ల నిధులు తెస్తే రాష్ట్ర ప్రభుత్వ వాట ఇవ్వకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి వేసి, స్వచ్ఛమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. చేనేత, కలంకారీ, ఆక్వా, వ్యవసాయ రైతుల్ని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపే నైజం జగన్‌దేనని అన్నారు. సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అతని ఆశాయాలు నచ్చి, జనసేనలోకి వచ్చానని తెలిపారు.