తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది.. నిత్యం దేశ విదేశాల నుంచి స్వామి వారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు సమర్పిస్తారు. బంగారం అయితే లెక్క లేనంత స్వామి వారి ఖాజానా కు చేరుతుంది . కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది. . వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా భారీగా పెరుగుతోంది. 2023-24లో టీటీడీ ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. టీటీడీ ఇప్పటివరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం కాగా.. టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొత్తం రూ.18 వేల కోట్లకు చేరాయి. కరోనా తర్వాత నుంచి స్వామి వారికి ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. 2023-24లో అత్యధికంగా 1,031 కిలోల బంగారం డిపాజిట్ చేయగా మొత్తంగా 11,329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా టీటీడీ రూ.1,200 కోట్ల వడ్డీ ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 7 గంటల నుంచి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 గంటలకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, అదనపు ఎఫ్ ఏ అండ్ సీఏవో రవి ప్రసాదు, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీకోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి . ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు స్వామివారు తెప్పలపై విహరిస్తారు.
సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ పాల్గొన్నారు.
ఏప్రిల్ 20 నుంచి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 20 నుంచి 22వ తేదీ వరకు బుగ్గోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa