రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan)కు బదులుగా ఆయన కుమారుడికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్‌లో బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ సందర్భంగా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన బ్రిజ్‌భూషణ్.. తన అనుచరగణంతో హడావుడి చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు 10 వేలమంది వరకూ హాజరయ్యారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, బీజేపీ స్థానిక నేతలు, అయోధ్యలోని ప్రముఖ అఖాడాలకు చెందిన సాధువులు ఉన్నారు.
అలాగే 500-700 వరకు ఎస్‌యూవీలు సభా ప్రాంగణంలో పార్క్ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక వేదికపై అంతా కుర్చీల్లో కూర్చుంటే.. బ్రిజ్ భూషణ్ మాత్రం సింహాసనంపై రాజు కూర్చున్నట్టు మధ్యలో ఒక సోఫాలో ఆశీనుడయ్యాడు. చేతిలో మైక్రోఫోన్ పట్టుకొని ఆయన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ హంగామా చేశారు. ఇక, గాల్లోకి పలు రౌండ్ల పాటు కాల్పులు జరపడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ ప్రక్రియలో తన కొడుకుతో పాటు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అలాగే, కరణ్ నామినేషన్ వేసేప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసు లోపలకు కూడా ఆయన వెళ్లలేదు.
‘లోపలికి వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. సాధారణంగా నేను ప్రచారానికి దూరంగా ఉంటాను.. నేను మిగిలిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాను. ఇలా దూరంగా ఉండమని ఎలాంటి ఆదేశాలు అందలేదు’ అని పేర్కొన్నారు. ఇక, ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్ భూషణ్.. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ ఆయనను కాదని కుమారుడికి టిక్కెట్ ఇచ్చింది. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని బడా నేతల్లో ఒకరిగా బ్రిజ్‌భూషణ్‌కు గుర్తింపు ఉంది. ఆయనపై భారీ సంఖ్యలో ఆరోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు, రెజ్లింగ్ అకాడమీలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించారు. యూపీలోని గోండా చుట్టుపక్కల ఆరు జిల్లాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. కైసర్‌గంజ్, గోండా, బలరామ్‌పూర్, శర్వాస్థథి, అయోధ్య, బహ్రెయిచ్ లోక్‌సభ స్థానాల్లో ఆయన గణనీయంగా ప్రభావితం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కైసర్‌గంజ్ స్థానంలో పార్టీ ఆయన కుమారుడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.