దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో వారం రోజుల కిందట మొదలైన రాకాసి అలలు క్రమంగా భారత తీరానికి దూసుకొస్తున్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది. ఇవి మే 4-5 మధ్య (శనివారం- ఆదివారం మధ్య) గోవా, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తీరంపై విరుచుకుపడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు తీరంలో రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని ఇన్‌కాయిస్ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది.
తీరంలోని లోతట్టు ప్రాంతాల రక్షణకు చర్యలు చేపట్టాలని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అత్యవసర విభాగాలకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు చేసింది. ‘ఏప్రిల్ 2భారత్ తీరానికి 10 వేల కిలోమీటర్ల దూరంలోని దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏప్రిల్ 26న శక్తివంతమైన అలలు మొదలయ్యాయి.. ఆ సమయం ఉవ్వెత్తున ఎగిసిపడి 60 సెకన్లపాటు గాలిలో నిలిచాయి..క్రమంగా అవి ఏప్రిల్ 28 నాటికి దక్షిణ హిందూ మహాసముద్రానికి చేరుకున్నాయి.
శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు దక్షిణ భారతదేశ తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా వాటి శక్తి తగ్గుతుంది. అయినప్పటికి అలజడి సృష్టిస్తాయి. సాధారణంగా తీరంలోని కెరటాలు 12-14 సెకన్లపాటు గాలిలో ఉంటాయి.. ఇవి మాత్రం 1.5 మీటర్ల ఎత్తున 25 సెకన్ల పాటు గాల్లో ఉండి తీరంలో అలజడి రేపుతాయి. ఆదివారం కూడా వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది.. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ ప్రభావం ఉంటుంది’ అని పేర్కొంది. రాకాసి అలలు తీరం దిశగా దూసుకొచ్చే సందర్భాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడం, తీరంలోని పడవలు, నావలు అదుపు తప్పడం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో కేరళలోని అలప్పుజ, కొల్లం, తిరువనంతపురం జిల్లాల్లోని తీరంలో అలలు విరుచుకుపడ్డాయి.
ఏంటీ రాకాసి అలలు?
ఈ అలలు సముద్ర ఉప్పెన వల్ల ఏర్పడతాయి.. అందుకే వీటిని ఉప్పెన అనే పేరుతో పిలుస్తారు. సముద్రపు అలలు స్థానిక పవనాలు, తుఫానులు లేదా చాలా కాలం పాటు భీకర గాలుల వల్ల కూడా సంభవిస్తాయి. అలాంటి సమయంలో గాలి నుంచి నీటిలోకి భారీ శక్తి బదిలీ అవుతుంది. ఇది బలమైన కెరటాలు ఏర్పడటానికి దారితీస్తుంది. అలాంటి అలలు తుఫాను మొదలైన కేంద్రం నుంచి తీరాన్ని తాకే వరకు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. సాధారణంగా హిందూ మహాసముద్రం దక్షిణ భాగంలో ఈ అలలు ఎక్కువగా పుట్టుకొస్తాయి. అక్కడ నుంచి ఉత్తరం వైపు ప్రయాణించి రెండు లేదా మూడు రోజుల్లో తీరానికి చేరుకుంటాయి.