చాబహార్ పోర్ట్ పదేళ్ల నిర్వహణకు ఇరాన్‌తో భారత్ చేసుకున్న ఒప్పందంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయని, వారితో వ్యాపార ఒప్పందాలను చేసుకునే ఎవరైనా ఎదురయ్యే పరిణామాల గురించి తెలుసుకోవాలని హెచ్చరించింది. మధ్య ఆసియాలో వాణిజ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోన్న భారత్.. చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందంపై సోమవారం సంతకం చేసింది. ఒమన్ గల్ఫ్ పక్కనే, ఇరాన్‌లోని ఆగ్నేయ ప్రావిన్సు సిస్తాన్ బలూచిస్థాన్‌లో చాబహార్ పట్టణం ఉంది. ఈ ఓడరేవు ద్వారా అంతర్జాతీయ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌ను ఉపయోగించి పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా అఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియాకు భారతీయ వస్తువులను రవాణా చేయవచ్చు.
చాబహార్ ఓడరేవు అభివృద్ధికి 2003లో ఇరాన్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. కానీ, ఇరాన్ అణుకార్యక్రమాలు చేపడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆంక్షలు విధించడంతో ఈ ప్రాజెక్ట్ పనులు నెమ్మదించాయి. మళ్లీ 2015 తర్వాత పురోగతి కనిపించింది. ఇరాన్, భారత్ ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. ‘‘చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందంపై ఇరాన్, భారత్ సంతకాలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది.. చాబహార్ ఓడరేవుతో పాటు ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వారికి విదేశాంగ విధానం ఉండొచ్చు.. కానీ, అమెరికాకు సంబంధించి, ఇరాన్‌పై ఆంక్షలు అమలులో ఉన్నాయి.. మేము వాటిని కొనసాగిస్తూనే ఉంటాం’’ అని వేదాంత్ అన్నారు. అంతేకాదు, వారితో ఎవరైనా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ముందు ఈ ఆంక్షల ముప్పు గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపు ఉంటుందా? అని ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు.
ఇక, ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా 120 మిలియన్ డాలర్లు పెట్టుబడులతో పాటు అదనంగా 250 మిలియన్ డాలర్లు రుణం సమకూర్చనుంది. టెహ్రాన్‌లోని జరిగిన ఈ ఒప్పందానికి భారత్ తరఫున కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్, ఇరాన్ మంత్రి మెహ్రదాద్ మెహర్దాద్ బజర్పాష్‌లు హాజరయ్యారు. తాజా ఒప్పందం 2016లో జరిగిన దానికి కొనసాగింపు. చాబహార్ పోర్ట్‌లోని షాహిద్ బెహెష్టీ టెర్మినల్‌లో భారత్ కార్యకలాపాల నిర్వహణకు అనుమతిస్తుంది. ఏటా పునరుద్ధరణ జరుగుతుంది.
ఇరాన్, అఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియాలో వాణిజ్యాన్ని పెంచుతుందని భావిస్తున్న విదేశీ నౌకాశ్రయం నిర్వహణను భారత్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ పోర్టు కోసం విదేశాంగ శాఖకు 2024-25 సంవత్సరానికి రూ.100 కోట్లను కేటాయించారు. ‘పదేళ్ల ఈ దీర్ఘకాలిక లీజు ఒప్పందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.. అదే సమయంలో ఈ ప్రాంతంలోని వాణిజ్య వర్గాల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది’ అని భారత్-ఇరాన్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఒప్పందంపై సంతకంతో చాబహార్‌లో భారత్ దీర్ఘకాలిక సంబంధాలకు పునాదులు వేశామని కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ అన్నారు.