పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పంపింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారా లేదా?.. కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని..వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై వివరణ అడిగింది.. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అంతేకాదు మాచర్ల ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి నిందితుడిగా చేర్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు కూడా తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ విషయాన్ని డీజీపీకి చెప్పాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కూడా ఆదేశించింది.
మాచర్ల ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని ఈసీ పోలీసులను ఆదేశించగా..కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడంతో పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.. పల్నాడు జిల్లా నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటుగా, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు మొదలు పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. సంగారెడ్డి వైపు పిన్నెల్లి వెళుతున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. అయితే కంది దగ్గర ఆయన కారును గుర్తించినట్లు సమాచారం. పోలీసులు పిన్నెల్లి డ్రైవర్‌తో పాటూ పలువురు అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి విదేశాలకు వెళతారనే అనుమానాలతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఘటనపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఈ నెల 20న ఈ కేసులో రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని.. ఏ1గా పిన్నెల్లిని పేర్కొన్నారని తెలిపారు. మొత్తం 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారని.. ఆయనకు ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తాము ఏదీ దాచిపెట్టలేదు.. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులకు ఆధారాలు అప్పగించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. వీటిలో మాచర్ల నియోజకవర్గంలో 7 ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనల్లో ఈవీఎం ధ్వంసం చేసినా డేటా సేఫ్‌గా ఉందని..కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ను కొనసాగించినట్లు మీనా క్లారిటీ ఇచ్చారు.
ఈ నెల 13న ఏపీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో పోలింగ్ కేంద్రం ఉంది. అక్కడ 202వ నంబర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం, వీవీప్యాట్‌ను నేలకేసి కొట్టారు.. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. ఇదంతా పోలింగ్ కేంద్రంలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.