సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ...జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్ట్ తయారు చేసి సొంత జిల్లాల వారికి పదువులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని, సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. బోగాపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు, వారి డైరెక్షన్ లో నడిచిన అధికారులే కారణమన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గులేకుండా టీడీపీపై బురద జల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.