ఎంతో మంది ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి వరకు వచ్చేవరకు మాత్రం విడిపోతూ ఉంటారు. అయితే కొందరు తమకు తాముగా విడిపోతే.. మరికొన్ని జంటలు మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల వేరు అవుతారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తాజాగా తన లవ్‌స్టోరీని వివరించారు. తాను చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. పెళ్లి కూడా చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదని వెల్లడించారు. ఇక తాము విడిపోవడానికి గల ప్రధాన కారణం.. తమ ఇద్దరి కులాలు వేరేనని.. పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని సిద్ధరామయ్య తెలిపారు. ఈ క్రమంలోనే 75 ఏళ్ల వయసులో తన ప్రేమకథను వివరించారు.
బుద్ధ పూర్ణిమ సందర్భంగా మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలపై ప్రసంగించారు. ఈ క్రమంలోనే తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డానని.. అయితే అమ్మాయి కులం, తన కులం వేరే కావడం వల్ల ప్రేమ విఫలం అయిందని తెలిపారు. అయితే ప్రేమించిన తర్వాత తమ పెళ్లి గురించి అడిగితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పారు. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా కులాంతర వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. అందుకు కారణం తాను వేరే కులానికి చెందిన వాడిని కావడమేనని తెలిపారు.
ఈ ఘటనతో తాను ప్రేమను, ప్రేయసిని వదిలేసి.. మరో ఆలోచన లేకుండా తమ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే కులాంతర వివాహాలు చేసుకునే వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో కుల నిర్మూలన కోసం ఎందరో సంఘ సంస్కర్తలు కృషి చేసినప్పటికీ ఇప్పటికీ సమానత్వం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో కులాల అంతరాలను నిర్మూలించాలంటే.. కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఒకటి కులాంతర వివాహాలు చేసుకోవడం.. మరొకటి అన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సిద్ధరామయ్య తెలిపారు. ఆర్థిక అభ్యున్నతి లేని సమాజంలో సామాజిక సమానత్వం ఎప్పటికీ సాధ్యం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.