ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు.. సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు ఇస్తుంటే.. అమరావతిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే.. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల పోలింగ్ పూర్తై.. 14 రోజులైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే సంస్థలు తమ పనిని పూర్తిచేశాయి. పోలింగ్ తర్వత ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజుల గ్యాప్ రావడంతో సర్వే సంస్థలు ఎక్కువమంది నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి అవకాశం దొరికింది. సంస్థలతో పాటు.. కొందరు అభ్యర్థులు సైతం సర్వే ఏజెన్సీలతో ఫలితాలపై సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఓటరు తీర్పు ఎలా ఉన్నప్పటికీ గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు.