పోలింగ్ హింసపై సిట్ విచారణ నేపథ్యంలో ఇప్పటికి పోలీసుల్లో కదలిక వచ్చింది. పోలింగ్ జరిగిన 13వ తేదీ, ఆ తర్వాత రోజు పల్నాడులో పలు ప్రాంతాల్లో రౌడీ మూకలు చెలరేగిపోయాయి. అయితే అప్పట్లో స్పందించని పోలీసులు సిట్ విచారణతో సెక్షన్లు మార్చి నిందితులను అరెస్టు చేస్తున్నారు. పలువురిపై రౌడీషీట్లు కూడా తెరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కూడా పల్నాడు జిల్లావ్యాప్తంగా పలువురి అరెస్టులు జరిగాయి. రెంటచింతల మండలం తుమృకోట, జెట్టిపాలెం గ్రామాలకు చెందిన 66 మందిపై కేసులు నమోదు చేశారు. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఈ కేసులు పెట్టినట్లు సమాచారం. తుమృకోట గ్రామానికి చెందిన 46 మందిపై, జెట్టిపాలెంలో ఇరు పార్టీలకు చెందిన 20 మందిపై కేసులు నమోదు చేశారు. రెంటాలలో పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు చెప్పారు. మాజీ జడ్పీటీసీ ఎన భాస్కర్‌రెడ్డి సహా 12 మందిని గురజాల అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి సత్యనారాయణ ఎదుట ఆదివారం హాజరుపరిచామన్నారు. వచ్చే నెల 7 వరకు గుంటూరు సబ్‌జైలుకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో పోలింగ్ హింసకు సంబంధించి 15 మందిని నకరికల్లు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితులకు రిమాండ్ విధిస్తూ స్థానిక రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టు ఇనచార్జి న్యాయాధికారి ఆర్ ఆశీర్వాదం పాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గుండ్లపల్లి గ్రామానికి చెందిన షేక్ చాంద్‌బాషా, అడవి అలీబాషా, షేక్ తుళ్ళూరు మొహిద్దీన, చింతపల్లి జానీ బాషా, భీమగారి సైదావలి, గుత్తికొండ మహబూబ్ సుభానీ, గామాలపాడు జిలానీ, చింతపల్లి ఇస్మాయిల్, షేక్ హుస్సేన బాషా, చింతపల్లి యూసుఫ్, మరో ఐదుగురు బాల నిందితులు ఉన్నారు. బాల నిందితులను గుంటూరు జువెనైల్ బోర్డు ముందు ప్రవేశ పెట్టారు. నకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ళ, సత్తెనపల్లి రూరల్ స్టేషన పరిధిలో 30 మంది పై రౌడీ షీట్లు తెరిచామని రూరల్ సీఐ రాంబాబు ఆదివారం తెలిపారు. ముప్పాళ్ల మండలం మాదలలో పెట్రో బాంబు కేసులో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఎన్నికల ముందు బైండోవర్ కేసులు నమోదు చేసిన వారిలో మరో 44 మంది ఎన్నికల గొడవల్లో పాల్గొన్నారని తెలిపారు.