జూనియర్ కళాశాలలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలను తెరపైకి తెచ్చింది. గ్రూపుల వారీగా సీట్లు భర్తీ చేయలేని పక్షంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లపై చర్యలు తీసుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో 137 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఏటా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 33 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు రెండేళ్లుగా ఉచిత పాఠ్యపుస్తకాలను అందించలేదు. ఈసారీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా పాఠ్యపుస్తకాలు రాలేదు. ఈ ఏడాది కూడా పుస్తకాలు లేనట్లేనన్న ప్రచారం జరుగుతోంది. బహిరంగ మార్కెట్‌లోనూ పాఠ్యప్తుకాలకు కొరత ఉంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులకోసం ఆయా ప్రింటింగ్ యూనిట్లకు ఇండెంట్లు పెట్టి కొంటున్నాయి. కాగా, ప్రైవేటు కళాశాలల్లో సామర్థ్యానికి మించి అడ్మిషన్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని డీవీఈవో సయ్యద్ మౌల తెలిపారు. ర్యాంకులు, టాపర్లంటూ కొన్ని ప్రైవేటు కాలేజీలు ఇష్టారాజ్యంగా ప్రచారాలు చేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.