విశాఖపట్నం నగరంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాల పర్యవేక్షణ, బహిరంగ ధూమపాన నిషేధం అమలు కోసం నోడల్ అధికారిగా జాయింట్ పోలీస్ కమిషనర్ కె.ఫకీరప్పని సీపీ రవిశంకర్ అయ్యన్నార్ నియమించారు. శుక్రవారం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మాగాంధీ కేన్సర్ ఆస్పత్రి, సీఐఐ ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం, ఈ-సిగరెట్ల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వివరిస్తూ రూపొందించిన పోస్టర్‌ను సీపీ రవిశంకర్‌అయ్యన్నార్ శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేన్సర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వున్నా మురళీకృష్ణ, సీఐఐ ప్రతినిధి హర్షవర్దన్ నగరంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం పక్కాగా అమలుచేయడంతోపాటు ఈ-సిగరెట్ల విక్రయాలు జరగకుండా గట్టిచర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్వరలోనే వివిధ రంగాల ప్రముఖులు, వైద్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామని సీపీ హామీ ఇచ్చారు. కేన్సర్ కారక పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చూసేందుకు జాయింట్ సీపీని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు సీపీ ప్రకటించారు.