ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని.. భారత వాతావరణ విభాగం ముందుగానే అంచనా వేసింది. దీనికి తోడు ఈసారి నైరుతి రుతుపవనాల ఆగమనం కూడా ముందుగానే జరిగింది. ఈ క్రమంలోనే ఒక రోజు ముందే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాల వ్యాప్తి.. తాము అనుకున్న దాని కంటే వేగంగా జరుగుతోందని ఐఎండీ అధికారులు తాజాగా వెల్లడించారు. దీంతో తాము అంచనా వేసిన దానికంటే ముందే దేశంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తాజాగా తెలిపింది.
కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు.. గురువారం తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించగా.. అనుకున్న తేదీ కన్నా ముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలను ఈ నైరుతి రుతుపవనాలు పలకరించాయి. దీంతోపాటు లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలోని పలు ప్రాంతాల్లోకి ఇవి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సాధారణంగా జూన్ 1 వ తేదీన కేరళలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 వ తేదీ నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు విస్తరిస్తూ ఉంటాయి. అయితే ఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. దీంతో అది కాస్తా రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని.. అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
మన దేశంలో వ్యవసాయం పూర్తిగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా జూన్ 5 వ తేదీలోపే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈలోపు ప్రీ మాన్‌సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది.