బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. ఢిల్లీలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్డీఏకి 292 సీట్లు రాగా, ఇండియా కూటమి 234 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏలో టీడీపీకి 16, జేడీయూకి 12 మంది ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పార్టీలు ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించనున్నాయి. ఇక తాము NDAతోనే ఉన్నామని స్పష్టం చేశారు చంద్రబాబు, నితీష్. కాగా ఇక్కడ రెండు ఆప్షన్లను పరిశీలిస్తుంది టీడీపీ. ఆప్షన్ 1 : కేంద్రంలో చేరి 5-6 మంత్రి పదవులు అడగటం, ఆప్షన్-2 : స్పీకర్ పదవి తీసుకుని, బయటినుంచి మద్దతు ఇవ్వడం. దీంతో సాయంత్రం జరిగే ఎన్డీయే మీటింగ్‌పై ఉత్కంఠత ఏర్పడింది. NDA కూటమిలో బలమైన పక్షంగా టీడీపీ ఉంది. దీంతో తెలుగుదేశం 5-6 మంత్రి పదవులు అడగొచ్చని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ మంత్రి పదువులు తీసుకుంటే… పోలవరం కోసం జలశక్తి శాఖ అడిగే అవకాశం ఉంది. అలానే ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, కేంద్ర ఆర్థికశాఖపైనా టీడీపీ కన్ను ఉన్నట్లు తెలుస్తోంది. అటు జేడీయూ సైతం కేబినెట్‌లో తమకు సముచిత స్థానం కావాలంటోంది. బిహార్‌కి ‘ప్రత్యేక హోదా’ కోరుతున్నారు ఆ పార్టీ నేతలు.
మరోవైపు చంద్రబాబు, నితీష్‌కి ఇండియా కూటమి గాలం వేస్తుంది. నియంతృత్వంవైపు ఉండాలో.. ప్రజాస్వామ్యంవైపు ఉండాలో.. ఇప్పుడు చంద్రబాబు తేల్చుకోవాలి అని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి తరపున చంద్రబాబుతోనూ, నితీష్‌తోనూ శరద్ పవార్ మాట్లాడతారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు. తాను వారిద్దరితోనూ మాట్లాడలేదనీ, మాట్లాడబోనని ఆయన తేల్చేశారు.. కొత్త మిత్రుల విషయంలో క్లారిటీ రావాలని రాహుల్ చెబుతున్నారు. ఇక NDA కూటమిలో ఉన్న నితీష్, ఇండియా కూటమిలో తేజస్వి యాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి రావడం చర్చనీయాంశమైంది.