ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. మరి కొన్ని రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక, ముహూర్తం కూడా ఖరారైంది. జూన్ 12వ తేదీన గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగనుంది. అయితే ఓ వైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే.. ఏపీ మంత్రివర్గంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. చంద్రబాబు టీమ్‌లో ఎవరెవరు ఉండనున్నారు.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ సీఎంతో కలిపి 25 మందికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా.. జనసేన నుంచి 21 మంది, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుండటంతో .. ఈ రెండు పార్టీలకు కూడా మంత్రి పదవులు దక్కనున్నాయి. మొత్తం 25 మంది మంత్రుల్లో టీడీపీకి 19 నుంచి 20 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. మిగతా ఐదు లేదా ఆరు మంత్రి పదవులను జనసేన, బీజేపీ నేతలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే జనసేనకు మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు కేటాయిస్తారంటూ పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో చేరితే ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చే ఛాన్సుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరకపోతే మాత్రం.. నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, కందుల దుర్గేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలుపొందింది. చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యేలలో ఇద్దరూ, లేదా ముగ్గురికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, సుజనా చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్. వీరిలో కామినేని శ్రీనివాస్ గతంలోనూ చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2014లో ఏర్పాటైన టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో కామినేని శ్రీనివాస్ వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే బీసీ కోటా కింద ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సత్యకుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే బీసీ నేతగా ఆయన పేరు కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ప్రమాణ స్వీకారంలోగా మంత్రిపదవులపై క్లారిటీ రానుంది.