ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో చంద్రబాబు ప్రక్షాళన మొదలుపెట్టారు. వరుసగా అధికారులపై వేటు పడుతోంది.. తాజాగా ఐపీఎస్‌లపై బదిలీ వేటు పడింది. సీఐడీ చీఫ్ (ఏడీజీ) ఎన్ సంజయ్‌తోపాటు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ, సిట్ చీఫ్ కొల్లి రఘురామ్‌రెడ్డిని బదిలీ చేశారు.. వారిద్దరిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇద్దరు అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరి బాధ్యతల్ని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అప్పగించారు. సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి జైలుకు తరలించే వరకు కొల్లి రఘురామరెడ్డి ఉన్నారు. అలాగే సీఐడీ చీఫ్‌గా సంజయ్ ఉన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ ఎండీ ఎం మధుసూదన్‌రెడ్డి, గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిపైనా బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. వీరిద్దరినీ జీఏడీ (సాధారణ పరిపాలనశాఖ)లో రిపోర్టు చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2014 టీడీపీ ప్రభుత్వం హయంలో ఉచిత ఇసుక విధానంలో అనుచిత లబ్ధి పొందారంటూ చంద్రబాబుపై గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడంతో.. సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే మొన్నటి వరకు సీఎంవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ అయ్యారు. సీఎంవోలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అదనపు కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా, కార్యదర్శి రేవు ముత్యాలరాజులను బదిలీ చేశారు. ఈ ముగ్గురు అధికారులను జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.