ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో బీజేపీకి బలం తక్కువ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు ముందు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీజేపీ ఖాతా తెరవలేదు. కానీ ఈ ఎన్నికల్లో కేరళలో ఒక్క సీటు సాధించి బీజేపీ బోణీ కొట్టింది. తమిళనాడులో మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. బీజేపీలో కీలక నేత అయిన అన్నామలై గెలుస్తారని భావించినా.. చివరికి పరాజయం పాలయ్యారు. కానీ తమిళనాడులో బీజేపీకి ఓటు శాతాన్ని పెంచడంలో అన్నామలై పాత్ర ఎనలేనిది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు కూడా అన్నామలైని ప్రశంసల వర్షం కురిపించారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవకపోయినా.. ఓటు శాతం మాత్రం గతం కన్నా భారీగా పెరిగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విజయం సాధించకపోయినా.. ఓటర్లను బీజేపీ వైపు తిప్పడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తమిళనాడులో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిన బీజేపీ ఓటు బ్యాంక్‌ను డబుల్ డిజిట్‌కు చేర్చారు. బీజేపీలో అన్నామలైకి ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో అన్నామలై ఎంపీగా గెలవకపోయినా.. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తమిళనాడులో సీట్లు రాకున్నా.. ఓటు శాతాన్ని పెంచిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ.. అన్నామలైని ఢిల్లీకి పిలిపించింది. ఈ క్రమంలోనే అన్నామలైకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే ఊహాగానాలు తమిళనాడు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినవారికి కేంద్ర మంత్రి పదవులు, గవర్నర్ పదవులు ఇచ్చినట్లే ఈసారి కూడా అన్నామలైకి తప్పకుండా మంత్రి పదవి కట్టబెడుతుందని పేర్కొంటున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన గణేషన్, సీపీ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్‌లను వివిధ రాష్ట్రాల గవర్నర్లుగా నియమించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అన్నామలైకి ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.మురుగన్‌కు కేంద్రమంత్రి వర్గంలో స్థానం కల్పించారని.. ఈ క్రమంలోనే ఆయనకు కూడా కేంద్రమంత్రి పదవి లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి 3.66 శాతం ఓట్లు రాగా.. ఈసారి ఎన్నికల్లో అది 11.24 ఓటు శాతం వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ 10.67 శాతంతో బీజేపీ కంటే వెనుకంజలో ఉంది. ఇక డీఎంకే 26.93 శాతం, అన్నాడీఎంకే 20.46 శాతం ఓట్లు సాధించాయి. ఇక తమిళనాడులోని 9 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.