లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు మౌనాన్ని వీడి.. స్పందించారు. తాను లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసినట్లు ఒప్పుకున్నారు. తమ అంచనాలు 20 శాతం తప్పాయని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయినప్పటికీ బీజేపీ ఓటు శాతం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 300 సీట్లు వస్తాయని అంచనా వేసినా.. ఫలితాలు వెల్లడైన తర్వాత 240 సీట్లు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు తప్పాయని ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.
ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సొంతంగా 300 స్థానాలు సాధించి.. మిత్ర పక్షాల అవసరం లేకుండానే కేంద్రంలో అధికారాన్ని చేపడుతుందని.. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. కానీ వాస్తవంగా మాత్రం బీజేపీ 240 స్థానాల దగ్గరే ఆగిపోయింది. సుమారు 20 శాతం తప్పుగా అంచనా వేశామని.. శుక్రవారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో తన అంచనాలను ప్రశాంత్ కిషోర్ సమర్థించుకున్నారు. బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ.. సాధారణ ఓటరు సెంటిమెంట్ చాలా వరకు ఖచ్చితంగానే ఉందని తెలిపారు. బీజేపీ ఓటు శాతం స్థిరంగా ఉందని చెప్పారు.
బీజేపీ పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి, కోపం ఉందని.. కానీ నరేంద్ర మోదీ పట్ల విస్తృతమైన శత్రుత్వం లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నడపగలరని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో మరో 20 నుంచి 30 ఏళ్ల వరకు బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఈ ఎన్నికల్లో 99 సీట్లు వచ్చినప్పటికీ.. ఆ పార్టీ పని తీరు అంతగా మెరుగుపడలేదని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు.
ఈ ఫలితాలు, కాంగ్రెస్ పార్టీకి గానీ రాహుల్ గాంధీకి గానీ.. పునరుజ్జీవనం ఇచ్చాయని భావించకూడదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఇవి మూడో చెత్త ఫలితాలు అని తెలిపారు. గత 2 ఎన్నికలతో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి కానీ పెద్దగా పునరాగమనం చెందలేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.