ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణం మారింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న ఐదురోజులు కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు.
మరోవైపు ఆదివారం రోజున.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దంటూ ఏపీ విపత్తుల సంస్థ ప్రజలకు సూచించింది. మరోవైపు శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో అత్యధికంగా 36 మిమీ, నెల్లూరు జిల్లా దుత్తలూరులో 32.7మి.మీ వర్షపాతం నమోదైంది.
నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఆంధ్రప్రదేశ్‌లో జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఐఎండీ అంచనాలకు అనుగుణంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా సాగునీటికి ఇబ్బందులు ఉండవని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.