ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇక జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే రిజిస్టర్ కాని పార్టీలు.. గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. వాటిని స్వీకరించి ఆమోదించేందుకు ఈసీ నిర్ణయించినట్లు సెక్రటరీ జయదేబ్ లాహిరి ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఇటీవలె కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. వెల్లడించారు.
చివరిసారిగా 2014 లో జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేశారు. 2016 లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత 2019 జూన్ 18 వ తేదీన బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. 2019 ఆగస్ట్ 5 వ తేదీన.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అదే రోజున జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టి జమ్మూ కాశ్మీర్, లడఖ్ అంటూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఉంది.
ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధికంగా 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. కాశ్మీర్ లోయలోని లోక్‌సభ స్థానాల్లో 51.05 శాతం ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు., గత 4 దశాబ్దాల్లో అదే అత్యధికమని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని.. స్థానిక రాజకీయ పార్టీలు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం చేరడంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరిలోగా జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.