లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, సహాయక మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు లభించాయి. కేబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేయగా.. తొలిసారి ఎంపీగా గెలిచిన డాక్టర్ పెమ్మసారి చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించగానే.. మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే ప్రశ్న రాగానే.. అందరికీ ముందుగా స్ఫురించిన పేరు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు మంచి వాగ్ధాటితో అనతి కాలంలోనే అందర్నీ ఆకట్టుకున్నాడు.
2014 ఎన్నికల్లో తొలిసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన.. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2014తో పోలిస్తే మెజార్టీ
భారీగా తగ్గినప్పటికీ.. జగన్ వేవ్‌లోనూ ఆయన పార్లమెంట్ గడప తొక్కారు. 2019లో టీడీపీ నుంచి ఎంపీలుగా ముగ్గురు మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఒకరు రామ్మోహన్ కాగా మరొకరు కేశినేని నాని (విజయవాడ), గల్లా జయదేవ్ (గుంటూరు). 2019లో గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు బీసీ కాగా.. మిగతా ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. విజయవాడ ఎంపీగా రెండోసారి గెలిచింది మొదలు.. చంద్రబాబు నాయుడ పట్ల, టీడీపీ నాయకత్వం పట్ల కేశినేని నాని విముఖంగానే ఉన్నారు. నాని కారణంగా విజయవాడ గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరడంతో.. ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఇది నచ్చని నాని.. తన కుమార్తె శ్వేతతో కలిసి ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ నుంచి ఫ్యాన్ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసి తమ్ముడి చేతిలో ఓడారు.
ఇక 2019లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ను జగన్ సర్కారు ఇబ్బంది పెట్టింది. పర్యావరణ నిబంధనల పాటించడం లేదనే కారణంతో గల్లా జయదేవ్‌కు చెందిన చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ ప్లాంట్ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) 2021 ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఓరకంగా గత ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. ఇవి తట్టుకోలేకపోయిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో గుంటూరు నుంచి ఆయన బదులు టీడీపీ నుంచి ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేశారు. వైద్యుడు, ప్రపంచాన్ని చూసిన వాడు, ఆర్థికంగానూ బలవంతుడైన పెమ్మసాని ఎంపీగా గెలవడంతోపాటు కేంద్ర సహాయక మంత్రిగానూ ప్రమాణం చేశారు.
గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నేని అనవసరమైన ఇగోకు పోయి.. టీడీపీ నుంచి బయటకు వెళ్లాడని లేకపోతే వరుసగా మూడోసారి గెలిచి మంత్రి పదవిని చేపట్టేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక గల్లా జయదేవ్‌కు వ్యాపారమే ముఖ్యం కావడంతో ఆయన కూడా రాజకీయాలను వదిలేశారు. అయినా సరే ఆయన ఢిల్లీలో రామ్మోహన్, పెమ్మసాని సహా ఎంపీలను కలిసి అభినందించారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఒకరు.. విజయవాడలో తన మాటే చెల్లుబాటు కావాలనే ధోరణితో వ్యవహరించి చివరకు పార్టీ మారి ఓడిపోగా.. మరొకరు వ్యాపారం కోసం రాజకీయాలకు దూరం అయ్యారు. కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన తట్టుకొని నిలబడ్డారు. అదే సమయంలో పార్టీ అధినాయకత్వం పట్ల విధేయతను కనబరిచారు. ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిందేననే మొండి పట్టుదల, నాయకత్వం పట్ల విధేయత.. ఈ రెండు అంశాలే రామ్మోహన్ నాయుణ్ని ప్రత్యేకంగా నిలబెట్టి కేంద్ర మంత్రి పదవికి తిరుగులేని ఛాయిస్‌గా మార్చేశాయి. సౌమ్యుడు, మృదుస్వభావి అయిన రామ్మోహన్ నాయుడు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.