అమరావతి రైతులకు గుడ్ న్యూస్.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు శుభవార్త అందింది. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అందింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ రాజధాని రైతులకు శుభవార్త చెప్పారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే రాజధాని పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్.. ఆదివారం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతి ప్రాంతంలో సీఆర్డీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. అయితే ఈనెల 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన సీఎస్.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎన్నికల ఫలితాలు ఏర్పడిన తర్వాత గత నాలుగైదు రోజులుగా రాజధాని ప్రాంతంలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. జేసీబీలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంఖుస్థాపన ప్రాంతంలో, , సీడ్ యాక్సిస్ రహదారి, కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్లోని ప్రధాన రహదారులు వెంబడి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అలాగే ముళ్ల కంపలు తొలగించడం, విద్యుత్ దీపాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
తన పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు, మధ్యలో ఆగిపోయిన భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. రాజధానికి గతంలో భూమిపూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సిఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అనంతరం అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయం భవనాలను, ఎంఎల్ఏల క్వార్టర్లు, ఏపీఎన్జీవో ఉద్యోగుల నివాస భవన సముదాయాలను సీఎస్ పరిశీలించారు. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, హ్యాపీ నెస్ట్ నిర్మాణాలను నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. హైకోర్టు అదనపు భవన సముదాయాన్ని కూడా సిఎస్ పరిశీలించారు.
అనంతరం మాట్లాడిన సీఎస్.. అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలొచ్చాయని నీరభ్ కుమార్ తెలిపారు. ఉద్దండరాయుని పాలెం వద్ద శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ తయారు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత రాజధాని ప్రాంత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్,అదనపు కమీషనర్, ఎస్ఇ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.