స్పీకర్ ఎన్నికతో దేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు వరుసగా మూడోసారి కొలువుదీరింది. 71 మందితో పూర్తిస్థాయి క్యాబినెట్‌ను ఏర్పాటుచేసిన మోదీ.. మంత్రులకు శాఖలను కేటాయించారు. ఇక, అత్యంత కీలకమైంది లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్ ఎన్నిక. దీనికి ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు. ఈ నేపథ్యంలో జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 24 నుంచి జులై 3 వరకు 8 రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
జూన్ 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం, జూన్ 26న స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో స్పీకర్ పదవి ఎవరు చేపడతారనేది ఆసక్తిగా మారింది. మోదీ 2.0లో స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లాను మళ్లీ కొనసాగిస్తారా? లేక టీడీపీ, జేడీయూలకు ఆ పదవిని ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. స్పీకర్ పదవి తీసుకోవాలని, లేకుంటే బీజేపీ మిమ్మల్ని నిలువునా మోసం చేస్తుందని చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లకు ఇండియా కూటమి పార్టీల నేతలు హెచ్చరించడం గమనార్హం. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్థవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే.. తమను బీజేపీ ఎలా మోసం చేసిందో మీకూ తెలుసంటూ ట్వీట్ చేశారు.
స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు?
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సెషన్‌కు ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. రాష్ట్రపతి నియమించే ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం సాధారణ మెజార్టీతో స్పీకర్‌ను ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి చేపట్టడానికి ఎటువంటి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. కానీ, రాజ్యాంగం, పార్లమెంట్ నిబంధనలు గురించి అవగాహన ఉన్న వ్యక్తయితే సభను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలుంటుంది. మోదీ ప్రధాని అయిన తర్వాత రెండుసార్లు బీజేపీ ఎంపీలు 2014 నుంచి 19 వరకు సుమిత్రా మహాజన్, 2019 నుంచి 24 వరకూ ఓం బిర్లాలు స్పీకర్‌గా ఉన్నారు. బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో స్పీకర్ పదవి ఆ పార్టీకి దక్కింది.
రేసులో ఉన్నది వీళ్లే
ఓం బిర్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది. రాజమండ్రి నుంచి గెలిచిన పురందేశ్వరికి క్యాబినెట్‌లో అవకాశం ఇవ్వకపోవడానికి ఇదే కారణమని ప్రచారం జరుగుతోంది. మన్మోహన్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అలాగే, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారాక రామారావు కుమార్తె కావడం కూడా కలిసొచ్చే అంశం.
ఒకవేళ టీడీపీకి గనుక స్పీకర్ వదిలిపెడితే ఎవరు ఆ పదవిని చేపడతారనే చర్చ జరుగుతోంది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు జీఎం హరీష్ మాధుర్ పేరు వినిపిస్తోంది. హరీశ్ మాధుర్ మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పోటీచేసినా... జగన్ వేవ్‌లో ఆయన ఓటమి చవిచూశారు. తొలుత శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరు వినిపించినా.. ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కడంతో హరీశ్ మాధుర్‌కు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.