కొత్తవలస పరిధిలోని జిందాల్ నగర్‌లోనున్న జేఎస్‌ఎల్ కార్మికులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. గురువారం కర్మాగారంలో కొత్తవలస సీఐ వి.చంద్రశేఖరరావు సమక్షంలో మూడు కార్మిక సంఘాల నాయకులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలలో 264 మంది ఉన్న కాంట్రాక్టు కార్మికులలో సగం మందికి మాత్రమే 15 రోజులు పని కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని యాజమాన్య ప్రతినిధులు కార్మిక సంఘాలకు తెలిపారు. అందుకు అంగీకరిస్తే కర్మాగారంలో విధించిన షట్టింగ్ డౌన్ ఎత్తి వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్మిక సంఘాలు మాత్రం కార్మికులందరికీ పని కల్పించాలని, లేకపోతే అందరికి లే ఆఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కార్మికులందరికీ లేఆఫ్ ఇవ్వలేమని, అందరికీ 15 రోజులు పని కల్పించలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. చర్చలు విఫలం కావడంతో నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నట్టు కార్మికులు తెలిపారు. ఈ సమావేశంలో యాజమాన్యం తరపున దినేష్ శర్మ, గోపాలకృష్ణ పాల్గొనగా... కార్మిక సంఘాల తరఫున పిల్లా అప్పలరాజు (టీఎన్‌టీయూసీ) నెక్కల నాయుడుబాబు, వామాలు (వైసీపీ ట్రేడ్ యూనియన్), గాడి అప్పారావు, నమ్మి చినబాబు(సీఐటీయూ) హాజరయ్యారు. గత 28 రోజులుగా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ..... జేఎస్‌ఎల్ కర్మాగారంలోని మూడు కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ తెలిపారు. గురువారం జేఎస్‌ఎల్ కర్మాగారం మెయిన్ గేట్ వద్ద నిరసన శిబిరానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....... కర్మాగారంలో లాకౌట్ విధించి సుమారు నెల రోజులు కావస్తోందని, కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. కొందరికి మాత్రమే లే ఆఫ్ ఇస్తానని యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు గాడి అప్పారావు, పిల్లా అప్పలరాజు, నమ్మి చినబాబు, బూసాల అప్పారావు, జి.వెంకటరావు, జి.బి.నాయుడు, సలాది బీమయ్య, లగుడు వామాలు, బాలిబోని ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.