నిమ్మనపల్లి మండలంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లిలో గురువారం తన ఇంటి వద్ద అరుదైన పునుగు పిల్లిని హోంగార్డ్ శ్రీనివాసులు కనుగొన్నారు. తెల్లవారు జామున వేకువ జామున తన ఇంటి వద్ద కుక్కలు మొరుగుతుండగా వెళ్లి చూడగా అక్కడ పొదల్లో పిల్లి లాంటి జంతువు కనిపించిదన్నారు. వెంటనే కుక్కలను తోలి ఆ పిల్లిని పట్టుకుని గోనెసంచిలో వేశాడు. అయితే ఆ పిల్లి ఆకారం మరోలా ఉండటంతో అటవీ సిబ్బందికి సమాచారం అందించాడు. అటవీ శాఖ సిబ్బంది వచ్చేంత వరకు స్థానిక పోలీ్‌సస్టేషనలో దానిని ఉంచారు. అనంతరం అటవీశాఖ గార్డు దీప అక్కడకు చేరుకుని పిల్లిని పరిశీ లించి దాని ఫోటోను తీసి ఉన్నతాదికారులకు పంపగా వారు పునుగు పిల్లిగా గుర్తించారు. అనంతరం అటవీ సిబ్బంది తవళం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీనేల్మేశ్వరస్వామి ఆలయం వద్ద అడవిలో దానిని వదిలి పెట్టారు. కాగా తిరుమల వేంకటేశ్వరస్వామికి అభిషేక సేవకు పునుగు పిల్లి తైలాన్ని ప్రతి శుక్రవారం వాడతారని తెలిసింది. దీని తైలం కారణంగానే శ్రీనివాసుడు నిత్యం ప్రకాశిస్తుంటాడని చెబుతుంటారు.