ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలుకాబోతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించే డీఎస్సీపై తొలి సంతకం పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే డీఎస్సీ కోసం సిద్ధమవుతున్న యువతకు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బంపరాఫర్ ఇచ్చారు.. ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ ఉచిత కోచింగ్ కోసం ఎవరైనా రావొచ్చని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఏపీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి విజయం సాధించిన కొలికపూడి శ్రీనివాసరావు.. డీఎస్సీకి సిద్ధమవుతున్నవారికి బంపరాఫర్ ప్రకటించారు. డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రకటించారు.. Free Coaching for DSC in Tiruvuru.. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రావొచ్చు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశారు. తిరువూరులో డీఎస్సీకి ఉచితంగా కోచింగ్ అందిస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా రావొచ్చని తెలిపారు. కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటనపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఉచితంగా శిక్షణ అందిస్తామని ప్రకటించడంతో ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు.. చాలా గొప్ప నిర్ణయం అంటున్నారు. అంతేకాదు కొలికపూడి శ్రీనివాస్ మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్ని, ఇతర అలవెన్సుల్ని.. ఏడాది పాటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. వీటిలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్లు) 6,371 ఉన్నాయి. అలాగే ఎస్‌ఏ (స్కూల్ అసిస్టెంట్లు)- 7,725, టీజీటీలు (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్)-1,781, పీజీటీలు (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్)-286, పీఈటీలు (వ్యాయామ ఉపాధ్యాయులు)-132, ప్రిన్సిపాళ్లు 52 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారకు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 6,100 పోస్టుల భర్తీకి ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.
గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ప్రకటనను అనుసరించి.. దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మాత్రం అవకాశం ఉంటుంది. గత జగన్ సర్కార్ హయాంలో 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రకటిస్తే.. ఇప్పుడు అదనంగా మరో 10వేలకుపైగా పోస్టులతో కలిపి డీఎస్సీకి ఆమోదం వచ్చింది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి. డీఎస్పీ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆరు నెలల్లో పోస్టుల భర్తీని పూర్తి చేయనున్నారు.