కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందినవారిగా గుర్తించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వస్తున్న లారీ.. పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు మరో లారీని డీకొట్టింది. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నట్లు చెబుతున్నారు. మరో లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నారు.
కంటైనర్ పాండిచ్చేరి నుంచి భీమవరం రొయ్యల ఫీడ్‌తో వెళుతోంది. బొలేరో వ్యాన్ తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళుతోంది. పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటైనర్‌ను బొలేరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.