లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి భంగపాటు ఎదురైంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వంటి వారు కూడా పరాజయం పాలయ్యారు. అయితే అసలు సమస్య ఎన్నికల తర్వాతే వచ్చింది. తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవడానికి అన్నామలై కారణం అంటూ.. ఎన్నికల తర్వాత తమిళిసై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదికపై.. తమిళిసై సౌందరరాజన్‌ను.. కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హెచ్చరిస్తున్నట్లు ఉన్న వీడియో వైరల్ కావడం.. దానిపై తమిళిసై వివరణ ఇవ్వడం తమిళనాడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తమిళిసై ఇంటికి అన్నామలై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక తమిళిసై సౌందరరాజన్, అన్నామలై మధ్య విబేధాలు తలెత్తినట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ.. అన్నామలై.. తమిళిసై ఇంటికి వెళ్లడం గమనార్హం. "ఇవాళ బీజేపీ సీనియర్ నాయకురాలు, తమిళనాడు బీజేపీ చీఫ్‌గా గతంలో కీలక పాత్ర పోషించిన తమిళిసై సౌందరరాజన్‌ను వ్యక్తిగతంగా ఆమె ఇంటికి వెళ్లి కలవడం చాలా సంతోషంగా ఉంది. తమిళనాడులో కమలం పార్టీ తప్పనిసరిగా వికసిస్తుంది. తమిళిసై సౌందరరాజన్ రాజకీయ అనుభవం, సలహాలు.. తమిళనాడులో పార్టీని గెలిపించేందుకు స్ఫూర్తిని ఇస్తాయి" అని తమిళిసైని కలిసిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ అన్నామలై పేర్కొన్నారు.
అయితే తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై, తమిళిసై వివాదం.. భారీగా దెబ్బతీసిందని బీజేపీ హైకమాండ్ గుర్తించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా ఓటమి చెందిన నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో బీజేపీ మెరుగైన పనితీరు కనబరిచేదని లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తమిళిసై సౌందరరాజన్ చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా బీజేపీ-ఎఐఎడీఎంకే విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళిసై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే జూన్ 12 వ తేదీన చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వేదికపైనే తమిళిసైపై సీరియస్ అయినట్లు ఓ వీడియోలో కనిపించింది. అన్నామలైపై ఆమె చేసిన విమర్శలకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యి.. తీవ్ర దుమారం రేపడంతో తమిళిసై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల తర్వాత తొలిసారి అమిత్ షాను కలిశానని.. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ఇక ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకుగానూ 22 సీట్లను అధికార డీఎంకే పార్టీ సాధించింది. ఇక డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలను గెలుచుకుంది. అయితే తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవలేదు. దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళిసై సౌందరరాజన్.. కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై ఘోర పరాజయాన్ని చవిచూశారు.