ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.. దీని కోసం ఓ కమిటీని వేస్తామన్నారు. అధ్యయనం తర్వాత నివేదిక రావడానికి రెండు, మూడు నెలలు పడుతుందన్నారు. రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని.. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని ప్రశంసించారు. కచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అమరావతి ప్రాంతంలోని ప్రతి గ్రామంతో తనకు అనుబంధం ఉందన్నారు నారాయణ. కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల్ని రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారని గుర్తు చేశారు. రూ.9వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్ల నిర్మాణం.. మౌలిక వసతులు కల్పించామన్నారు. అలాగే రాజధానిలో ఐఏఎస్‌లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాలుగో తరగతి ఉద్యోగుల వసతి భవనాలు.. గత టీడీపీ ప్రభుత్వంలోనే 70-90% పూర్తయ్యాయని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్నికొనసాగిస్తే అమరావతి పూర్తయ్యేదన్నారు ఏపీ మంత్రి. అమరావతి పనులు పూర్తి చేసేందుకు రీ టెండర్లు పిలవడమా.. ఉన్నవారిని కొనసాగించడమా అనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఆరేడు నెలల్లో వసతి భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని.. అమరావతి పనుల ప్రారంభంపై పదిరోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. కచ్చితంగా అమరావతిని నిర్మించి చూపిస్తామని.. రాజధాని అమరాతికి భూముల సేకరణ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అన్నారు.
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు మంత్రి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీకి మూడు రాజధానులంటూ గొడవ చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి.. త్వరలోనే చెత్త పన్ను రద్దుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2014లో తాను నిర్వహించిన శాఖల్నే మళ్లీ తనకు ఇచ్చారన్నారు.. అందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు నారాయణ. అంతేకాదు టీడీపీ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 11లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామన్నారు. ఇప్పుడు కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణాలని కొనసాగిస్తామని..ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు.