ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో బిజీ అయ్యారు. రెండు రోజులుగా పాలనాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టారు.. అవసరమైన చోట ప్రక్షాళన మొదలు పెట్టారు. ఒకటి, రెండు రోజుల్లో మరికొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని.. కొన్ని వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. అవసరమైన చోట అధికారుల్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. పాలనమాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు.
ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సమస్యలపై అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన ఏపీ ఎన్జీవో సంఘం నాయకులతో సీఎం ఈ విషయాన్ని చెప్పారు. ఉద్యోగులకు సమస్యలు, కొన్ని డిమాండ్లు ఉన్నాయని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు కర్నాటి వెంకట శివారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. ఈ నెలాఖరులోపు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతానని.. అన్ని అంశాలను చర్చిద్దామని చంద్రబాబు చెప్పారు.
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, పురుషోత్తమ నాయుడు, ఇతర నాయకులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని శాలువాతో సత్కరించారు. ఏపీ జేఏసీ, ఏపీ ఎన్వోవో సంఘం ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని నాయకులు తెలిపారు. చంద్రబాబు ఈ నెలఖరు సమావేశమవుదామని తెలపడంతో ఉద్యోగ సంఘ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీలో అన్ని సమస్యల్ని ప్రస్తావిస్తామని చెప్పారు.