ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టి.. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వదిన సురేఖ అపురూపమైన కానుక అందించారు. భర్త మెగాస్టార్ చిరంజీవితో కలిసి పవన్ కళ్యాణ్‌కు అరుదైన, అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చిరంజీవిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా మరిదిని ఆశీర్వదించిన కొణిదెల సురేఖ.. అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నును పవన్ కళ్యాణ్‌కు గిఫ్టుగా ఇచ్చారు.
దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. వదినమ్మ తన స్వహస్తాలతో పెన్ను అందిస్తుంటే పవన్ కళ్యా్ణ్ సంబరపడ్డారు. అయితే అప్పటికే తన వద్ద పెన్ను ఉందంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది కూడా ఉంచుకో అంటూ సురేఖ పవన్ కళ్యాణ్ జేబులో ఈ పెన్ను ఉంచారు. మరోవైపు చిరంజీవి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజనం పెన్ను విలువను తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ మొదలెట్టారు.
అయితే మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నులు ఖరీదెక్కువ. సురేఖ పవన్‌కు ఇచ్చిన మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నుల ధరలు రూ.90 వేల నుంచి రూ.2.60లక్షల వరకూ ఉన్నాయి. వీటిలో బాల్ పాయింట్ పెన్నులు ఓ రేటు.. ఫౌంటేన్ పెన్నులు మరో ధర ఉంటాయి. బాల్ పాయింట్ పెన్నులు అయితే 90 వేల రేంజులో ఉంటే.. ఫౌంటెన్ పెన్నుల ధరలు మాత్రం రూ. 2.60 లక్షలు పైగానే ఉన్నాయి. మరోవైపు లగ్జరీ పెన్నులు, రీఫిల్స్, బ్యాగ్స్, వాచీలు, లెదర్ వస్తువులు, సెంట్లు వంటి ఖరీదైన ఉత్పత్తులను మోంట్ బ్లాంక్ కంపెనీ తయారుచేస్తుంది.
మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు.. సీఎం చంద్రబాబు నాయుడు అనేక కీలక శాఖలు కేటాయించారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమించారు. ఇక ప్రమాణ స్వీకారానికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అన్నయ్య చిరు దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవటం.. ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీని చిరంజీవి వద్దకు తీసుకురావటం కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది.