ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. రెండు రోజులుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తూ.. టీటీడీకి కొత్త ఈవోను నియమించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలోని కొన్ని పథకాలకు పేర్లు మార్చారు.. తాజాగా మరో కార్యక్రమానికి కూడా చంద్రబాబు సర్కార్ పేరు మార్చింది. గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో మార్పులు చేయాలని నిర్ణయించింది. స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది.
చంద్రబాబు ప్రభుత్వం ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరించనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది..ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలు చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
2014లో విజయం సాధించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌ల పరిశీలన కోసం.. ప్రజావేదిక నిర్మించింది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత స్పందన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే స్పందన ద్వారా సమస్యలు పరిష్కారం కాలేదని భావించిన చంద్రబాబు సర్కార్.. రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టమ్ అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలు కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు.. గత ఐదేళ్లలో ఆర్థికశాఖలో జరిగిన అవకతవకల్ని, అప్పులపై వివరాలను వెల్లడించాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థికశాఖకు సంబంధించి నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారు. కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు?.. ఆ అప్పులను ఎక్కడ వెచ్చించారు అనే అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు.
గత ప్రభుత్వం తెచ్చిన అప్పులెన్ని, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పులెన్ని అనేది తేలాల్సి ఉంందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తామని.. అక్కడ నుంచి ముందుకు వెళ్తామన్నారు. ఏపీ ప్రజలు పాలనను మళ్లీ గాడిన పెట్టాలని తీర్పు ఇచ్చారన్నారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని.. తాము ఎక్కువ శ్రమ పడాల్సి ఉందన్నారు. రాష్ట్ర అప్పు ఎంతనేది ప్రజలకు తెలియజేస్తామని.. ఒకరిద్దరు అధికారులకే ఈ వివరాలు తెలుసు అన్నారు. తాను పీఏసీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు లేవనెత్తిన అంశాలపై కూడా ఫోకస్ చేస్తానన్నారు. రాష్ట్రంలో పన్నులు పెంచకుండా, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం నడపడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబు బ్రాండ్, ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచి ఆదాయాలు పెంచుతామన్నారు మంత్రి.