జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా కీలకమైన శాఖల్ని తీసుకున్నారు. ఆయనకు పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణ శాఖల్ని అప్పగించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖల్ని పట్టుబట్టారట.. ముఖ్యంగా ఈ శాఖల్లో తాగునీటి సరఫరాను అడిగి మరీ తీసుకున్నారట. జనసేనాని తాగునీటి సరఫరా బాధ్యతల్ని తీసుకోవడానికి బలమైన కారణం ఉందంటున్నారు జనసైనికులు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన ఓ విషయాన్ని.. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అరకు ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లారు.. నాలుగు గంటల పాటూ అక్కడి ప్రజలతో మాట్లాడి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనను పవన్ గుర్తు చేసుకున్నారు. 'అరకు నుంచి తిరిగి వస్తుంటే.. మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టారు. నేను వెంటనే కారు నుంచి కిందకు దిగాను.. వారిలో ఓ 70 ఏళ్ల మహిళ తాగునీళ్లు సరిగా లేవని చెప్పారు. మేం ఎలాంటి నీళ్లు తాగుతామో చూడూ అంటూ నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. ఊరి ఎక్కడని అడిగితే దగ్గరలోనే ఉందని చెప్పారు.. మెయిన్ రోడ్డులో నుంచి లోపలికి వెళ్లాం.. ఏడు కిలోమీటర్లు నన్ను నడిపించారు.. రోడ్డు కూడా సరిగా లేదు. అక్కడ తాగే నీళ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి.. పురుగులు, క్రిములు ఆ నీళ్లలో తిరుగుతున్నాయి. ఆ నీళ్లను వడకట్టుకుని తాగుతున్నామని ఆమె చెప్పారు.. మనం ఉన్న సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆవిడ తాగేందుకు కొంచెం నీళ్లవ్వండి బాబూ.. మాకేమీ వద్దు అని నన్ను అడిగింది. అది కూడా ఇప్పుడు అడగను.. రేపు ప్రభుత్వంలోకి వస్తే మా ఊరిని గుర్తు పెట్టుకో చాలు అని చెప్పారు' అని పవన్ కళ్యాణ్ అప్పుడు జరిగిన విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశంలో ప్రస్తావించారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాగునీటి సరఫరాశాఖ బాధ్యతల్ని కూడా తీసుకున్నారు. దీంతో ఈ వీడియోను జనసైనికులు వైరల్ చేస్తున్నారు. ఆ పెద్దావిడ చెప్పిన మాటలు విని.. ఆమె కోసం ఈ తాగునీటి సరఫరాశాఖ తీసుకున్నారా అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆ పెద్దావిడకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని జనసైనికులు పవన్ కళ్యాణ్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటుగా.. ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్రసాంకేతిక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను టీడీపీకి చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ పవన్ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆ శాఖల్ని ఆయనకు కేటాయించారు. జనసేన మూల సిద్ధాంతాల్లో ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ ఒకటి. ఆ లక్ష్యంలో భాగంగానే అటవీ, పర్యావరణ శాఖను ఆయన ఎంచుకున్నట్లు చెబుతున్నారు.