ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిషికేష్ - బద్రీనాథ్ హైవేపై వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పి అలకనంద నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇక మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మొత్తం 23 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. రోడ్డుపై నుంచి అలకనంద నదిలో ఆ వాహనం పడిపోవడంతో నుజ్జునుజ్జు అయింది.
రుద్రప్రయాగ్ జిల్లాలోని రిషికేషన్ - బద్రీనాథ్ జాతీయ రహదారిపై రైటోలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో రహదారిపై నిలపడి ఉన్నవారు కూడా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద సమయంలో ఆ ట్రావెలర్‌లో మొత్తం 23 మంది ప్రయాణికులు వెళ్తుండగా.. అది కాస్తా నదిలో పడటంతో 10 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక గాయపడిన వారిని రిషికేష్ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే గాయపడిన ప్రయాణికుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని రిషికేష్ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరపాలని రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పుష్కర్ సింగ్ ధామీ.. వారికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.