వైసీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన రుషికొండ భవనాల తలుపులు తెరుచుకున్నాయి. భీమిలి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో కలిసి రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరుపై విమర్శలు, ఆరోపణలు చేశారు. రుషికొండ కట్టడాలపై ఏం జరుగుతుందనేదీ తెలుసుకోవడానికి వస్తే అక్రమ కేసులు పెట్టారని గంటా విమర్శించారు. అయితే ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వంలోకి వచ్చామన్నారు. మరోవైపు రుషికొండలో పచ్చటి టూరిజం రిసార్టును కూల్చివేసి, విలాసవంతంగా కట్టడాలను కట్టారని ఎమ్మెల్యే గంటా ఆరోపించారు. రుషికొండ నిర్మాణాలపై మొదటి నుంచి వివాదాలే నడుస్తున్నాయన్న గంటా శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ పచ్చటి కొండను గుండు చేశారని విమర్శించారు.
రుషికొండలో నిర్మాణాలు ప్రారంభించిన సమయంలో టూరిజం కోసం అన్నారని.. ఆ తర్వాత రిసార్ట్స్ అంటూ పేరుమార్చారని గంటా అన్నారు. మరికొంత కాలానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని వైసీపీ నేతలు చెప్తూ వచ్చారన్నారు. రుషికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలు ఇచ్చిందనీ.. అయినా కూడా రహస్యంగా వీటి నిర్మాణాలు ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనాలను.. వైఎస్ జగన్ చివరకు చూసుకోకుండానే ప్రజలు తీర్పు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
మరోవైపు రూ.450 కోట్లు ఖర్చుచేసి మొత్తం 7 బ్లాక్‌లలో రుషికొండలో నిర్మాణాలు జరిగినట్లు గంటా ఆరోపించారు. నిర్మాణాలపై కోర్టులు వేసిన కమిటీలు కూడా అక్రమ నిర్మాణాలని నివేదిక ఇచ్చినట్లు గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ భవనాలను ఏం చేయాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని చెప్పారు. త్వరలోనే విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందన్న గంటా శ్రీనివాసరావు.. అప్పటిలోగా ఏ విషయమనేదీ క్లారిటీకి వస్తామని చెప్పారు. అయితే అక్రమ నిర్మాణాలు అంటూ అప్పట్లో ఆరోపించిన నేపథ్యంలో వీటిని పడగొట్టాలా లేదా.. వందలకోట్లు ఖర్చుచేశారు కనుక అలాగే కొనసాగిస్తారా అనేదీ చూడాల్సి ఉంటుంది.