ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువు దీరింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌తో పాటుగా మంత్రులందరూ కొలువుదీరారు. ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో .. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జీతం ఎంత ఉండవచ్చనేదీ ఆసక్తికరంగా మారింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు సైతం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జీతం ఎంత ఉండొచ్చనేదీ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మనదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీజేఐ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఇలా ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అంటూ నెల జీతం అందిస్తారు. అయితే ముఖ్యమంత్రుల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రానికి ఈ సంఖ్య మారిపోతూ ఉంటుంది. ఒక రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం అందింతే.. మరో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జీతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జీతం నెలకు రూ. 3.35 లక్షలుగా ఉంది. ఇందులో ఎమ్మెల్యే జీతం కూడా కలిసి ఉంటుంది.
ఇక సాధారణంగా ముఖ్యమంత్రులకు బస, కాన్వాయి, సెక్యూరిటీ సహా దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అలాగే వారికి హెలికాఫ్టర్లను సైతం అందుబాటులో ఉంచుతారు. మరోవైపు దేశంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం ఉన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రికి నెలకు 4 లక్షల 10 వేల వేతనం అందుతోంది. రూ. 3.90 లక్షలతో ఢిల్లీ సీఎం రెండో ప్లేసు, రూ.3.65 లక్షలతో యూపీ సీఎం మూడో స్థానంలో ఉన్నారు. రూ.3.40 లక్షలతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉండగా.. ఏపీ ముఖ్యమంత్రికి నెలకు రూ. 3,35,000 జీతంగా అందుతోంది. అందరికంటే తక్కువగా త్రిపుర ముఖ్యమంత్రి రూ. 1,05,500 జీతంగా పొందుతున్నారు.