మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్బంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికలలో ఇదే ఈవీఎంలు అద్భుతం అని చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పులేక జగన్ ఈవీఎంలపై నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు. బటన్ నొక్కగానే ఏ గుర్తు అనేది కూడా స్పష్టంగా కనిపించిందని, ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కేశినేని చిన్ని అన్నారు. భ్రమలువీడి, ప్యాలస్ నుంచి బయటకి రావాలన్నారు. ప్రజా జీవితంలోకి వస్తే ఇప్పుడు అయినా వాస్తవాలు తెలుస్తాయన్నారు. విశాఖ భవంతుల ఉదంతం బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా వైసీపీకి వచ్చేవి కావన్నారు. ప్రజాధనం రూ. 500 కోట్లు దుర్వినియోగం చేశారని.. బాత్రూంకు రూ. ఐదు కోట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతామన్నారు. జగన్ వాస్తవంలోకి వస్తే మంచిది... లేదంటే మూడు నెలల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.
![]() |
![]() |